హ్యాట్సాఫ్ ఫొటోగ్రాఫర్.. హృదయాన్ని కలిచివేసే ఫొటో
డమాస్కస్: అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియా నుంచి కొన్నేళ్లుగా గుండెల్ని పిండేసే ఎన్నో ఫొటోలు ప్రపంచం ముందుకు వచ్చాయి. విగత జీవులైన చిన్నారులు.. తమవాళ్లను కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న వారి ఫొటోలు కలిచివేశాయి. ఫొటోలే మనల్ని ఇంతలా కలచి వేస్తుంటే.. వాటిని ప్రత్యక్షంగా చూస్తూ ప్రపంచం ముందుకు తీసుకొస్తున్న అక్కడి ఫొటోగ్రాఫర్ల పరిస్థితి ఎలా ఉంటుంది. తమ వృత్తిధర్మంలో భాగంగా ఈ హృదయ విదారక ఘటనలను వారు ఫొటోలు తీస్తున్నారు. కానీ వీటన్నిటినీ చూసి విసిగిపోయాడు ఓ ఫొటోగ్రాఫర్. తన వృత్తిధర్మాన్ని కాసేపు పక్కనపెట్టాడు. ఆత్మాహుతి దాడిలో గాయపడిన ఓ చిన్నారిని కాపాడటానికి ఆ ఫొటోగ్రాఫర్ అతన్ని తన చేతులపై మోసుకెళ్తున్న ఫొటోలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ చిన్నారిని కాపాడగలిగినా.. మరో చిన్నారి తన కళ్ల ముందే చనిపోవడం చూసి అతను గుండెలవిసేలా రోధిస్తున్న మరో ఫొటో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతవారం అలెప్పోలో బస్సులపై జరిగిన బాంబు దాడి సందర్భంగా ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఈ దాడిలో 80 మంది చిన్నారులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ సమయంలో అక్కడ తన విధులు నిర్వర్తిస్తున్న ఫొటోగ్రాఫర్ అబ్ద్ అల్కదర్ హబక్.. దాడిలో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తేరుకున్న అతడు అక్కడున్న చిన్నారుల దీనస్థితిని గమనించి.. వాళ్ల ప్రాణాలను కాపాడటానికి కెమెరాను పక్కన పడేశాడు. ముందు ఓ చిన్నారిని చూస్తే అతను అప్పటికే చనిపోయాడు. మరో చిన్నారి దగ్గరికి వెళ్తే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని వెంటనే చేతుల్లోకి తీసుకొని అంబులెన్స్ వైపు పరుగెత్తాను. ఆ చిన్నారి నన్ను గట్టిగా పట్టుకొని, నావైపు దీనంగా చూడటం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతున్నది అని హబక్ ఆ భయానక ఘటన గురించి చెప్పాడు.
ఈ ఫొటోలను అక్కడే ఉన్న మరో ఫొటోగ్రాఫర్ ముహమ్మద్ అల్‌గరెబ్ తీశాడు.
తాను కూడా ముందు కొందరు గాయపడిన వారికి సాయం చేసి తర్వాత ఫొటోలు
తీసినట్లు అల్‌గరెబ్ చెప్పాడు. తాను సాయం చేసిన ఏడేళ్ల బాలుడు బతికాడా
లేడా అన్నది తర్వాత తనకు తెలియలేదని హబక్ అన్నాడు. ఆ తర్వాత మరో
చిన్నారిని విగతజీవిగా చూసే సరికి తాను దుఃఖం ఆపుకోలేకపోయానని అతను
చెప్పాడు.